సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆర్ఎస్ఎస్, టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేసీ చివరకు కాంగ్రెస్ పార్టీలో సెటిలైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి "పక్కా ఆర్ఎస్ఎస్ మనిషి" అని ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడా నిజం ఉండదని, ముస్లిం మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక బిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రోజ్ గార్డెన్ లో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోం మంత్రితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, బీఆర్ఎస్ మాజీ పోలీట్ బ్యూరో సభ్యులు సయ్యద్ ఇబ్రహీం, మైనార్టీ నేతలు సయ్యద్ సాదిక్, సర్వర్ పాషా నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున వేలాదిగా హాజరయ్యారు.ముస్లిం మైనార్టీ ప్రజల సమ్మేళనాన్ని ఉద్దేశించి హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ముస్లింలకు ఎన్నడు న్యాయం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూల రాజ్యంలో ముస్లింలు ఎందరో మత విద్వేషాలకు బలయ్యారని గుర్తు చేశారు. ముస్లింలకు విద్యను ఒక పథకం ప్రకారం దూరం చేసి వారి జీవితాలతో రాజకీయంగా ఆడుకున్నారని అన్నారు. 2014 నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ముస్లింల జీవన విధానం పూర్తిగా మారిపోయిందని అన్నారు. పేదరికానికి దరిద్రానికి చదువు ఒక్కటే లేకపోవడం కారణమని గ్రహించి రాష్ట్రవ్యాప్తంగా 2014 నుండి 2016 వరకు కేవలం రెండు సంవత్సరాల్లోనే 204 గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని అన్నారు. అవే పాఠశాలలను ఇంటర్మీడియట్ సంస్థలుగా అప్ గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 5300 మంది నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, బిడిఎస్, ఫార్మా తదితర విభాగాల్లో గొప్ప విద్యను అందించిందని అన్నారు. వీరంతా కటిక నిరుపేదలని పంక్చర్ దుకాణాలు, కిల్లి షాపులు, హోటల్లు, నడుపుకునే చిన్న పేద తరగతి ప్రజల బిడ్డలని అన్నారు. విదేశాలకు చదువుకునే ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలను ఉచితంగా ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. కెసిఆర్ కొడుకు కూతురు అమెరికాలో ఎలా చదువుకున్నారో ఇప్పుడు పేదింటి బిడ్డలు కూడా అలాగే చదువుకుంటున్నారని అభినందించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద యువతుల వివాహాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి కేవలం రెండు కోట్లు వచ్చాయని, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 2300 కోట్లు షాది ముబారక్ నిధులు వచ్చాయని అన్నారు. తెలంగాణ రాకముందు శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేదని ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను మార్చుకునేందుకు కర్ఫ్యులు పెట్టుకునే వారని పేద ముస్లింలను బలి చేసేవారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇమామ్, మోజన్లకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని కెసిఆర్ ప్రభుత్వంలో 10వేల వేతనాలు ఇస్తున్నామని అన్నారు. తలనైనా నరుక్కుంటాం బిజెపితో దోస్తీ చేయం. తలనైనా నరుక్కుంటాం కానీ భారతీయ జనతా పార్టీతో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దోస్తీ చేయదని మహమూద్ అలీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తుందని అన్నారు. ముస్లిం ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపితో తమకు ఎలాంటి ములాఖాత్ లేదని హోం మంత్రి అన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘంతో సంబంధాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పెట్టడం వల్ల సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా మరెందరో తమ ముందు తిట్ల పురాణం చేస్తున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు అని టిఆర్ఎస్ పార్టీకి ముస్లింలు ఓటు వేయాలని అన్నారు. నిజాయితీపరుడు ఎమ్మెల్యే అంజయ్య. ఎమ్మెల్యే అంజయ్య గెలుపు కోసం గత ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చా.. మళ్లీ ఎన్నికల్లో ఆయన కోసమే వచ్చా. నోట్లో నాలుక లేని వ్యక్తి ఎమ్మెల్యే అంజయ్య అని ఆయనను గెలిపిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని హోం మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఎంతో సౌమ్యుడిగా ఆయన పేరు సంపాదించారని ఆయనను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులు అవుతారని అన్నారు. అంజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముస్లింలంటే నమ్మకం ఎక్కువ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ముస్లిం మైనార్టీ ప్రజలు అంటే తనకు ఎంతో నమ్మకమని వారు ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పరని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ముస్లిం ప్రజలు రాజకీయంగా ఈ నియోజకవర్గంలో ఎదిగేందుకు ఎందరికో అవకాశం కల్పిస్తానని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో పాతబస్తీ అల్లర్లు జరిగేవని ఇప్పుడు అన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గంలో ముస్లింల కోసం ఈద్గాలు షాది ఖానాలు కబరస్థాన్ కాంపౌండ్ వాళ్ళు ఇంకా గురుకుల పాఠశాలలు కళాశాలలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు 9 ఏళ్లలో ఎన్నో చేపట్టామని అన్నారు. వేల కోట్లు షాది ముబారక్ కోసం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిదని అన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ ఉంటే ముస్లింలకు భద్రత. కర్ణాటకలో ముస్లింలకు భద్రత లేదని గత బిజెపి ప్రభుత్వ హయాంలో హిజాబ్, మత ఘర్షణలు అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇలాంటి జరిగేవి కావని అన్నారు. అక్కడ ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని కానీ తెలంగాణలో ముస్లిం ప్రజల భద్రతకు కేసీఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని అన్నారు. జేపీ దర్గా మాస్టర్ ప్లాన్లో పేద ప్రజలకు నష్టం జరగకుండా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదుకున్నారని అన్నారు. జేపీ దర్గా అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ముస్లింలకు ఆర్థికంగా ఆదుకుంటాం - రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన చూడండి, టిఆర్ఎస్ పదేళ్ల పాలన చూడండి మీకే అర్థం అవుతుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాల హయాంల గురించీ ఆయన ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ ప్రజల ముందు బేరీజు వేశారు. కెసిఆర్ ఒత్తిడితోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ముస్లిం ప్రజలు కనీసం స్వేచ్ఛగా మత ప్రార్థనలు చేయలేని దుస్థితి నెలకొందని అక్కడివాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయడం సిగ్గుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ వైరస్ లాంటిదని కెసిఆర్ వ్యాక్సిన్ లాంటివాడని ఇంతియాజ్ చురకలు అంటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవేవో చెబుతున్నారని అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. షాద్ నగర్ షాన్ నిలబడాలంటే అంజన్నకు ఓటు వేసి ముస్లింలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ పోలీట్ బ్యూరో సభ్యుడు ఇబ్రహీం మహమ్మద్ ఎజాజ్ అడ్డు, అబ్దుల్ జామి, సర్వర్ పాషా అష్రాఫ్, సలీం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమం చివరలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరు మాజీ వైస్ ఎంపీపీ పాండు నాయక్ మరో 20 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
-----------------------
Admin