సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెత్తందారుల దాడులు, దౌర్జన్యాలు అక్రమాలు భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపకపోతే ఇవి పెచ్చుమీరే ప్రమాదం ఉందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు. షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయదశమినాడు లాంచనంగా అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామానికి తరలి వచ్చారు. శాస్త్రోక్తంగా వాస్తు రీత్యా ఈశాన్య మూల నుండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని, ప్రచార రథాలను ఆరంభించారు. కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంతో పార్టీ శ్రేణులు జోష్ లోకి వచ్చారు. షాద్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని నవంబర్ 30న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ సాధించిన వీర్లపల్లి శంకర్ ను ప్రజలు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసి శ్యాoసుందర్ రెడ్డిలతో కలిసి కొత్తూర్ మండలం సిద్దాపూర్ లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు వీధుల్లో కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే నినాదాలకు హోరెత్తించారు. వీర్లపల్లి ప్రచారానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహిళలు సైతం ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని నింపారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్లతో ప్రచారాన్ని ప్రారంభించారు. కెసిఆర్ కుటుంబ పాలన దొరల, పెత్తందారుల దౌర్జన్యాలు అక్రమాలను పారద్రోలాలంటే షాద్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పీటీసీ శ్యాoసుందర్ రెడ్డి, ఫరూఖ్ నగర్ జడ్పీటీసీ వెంకట రాంరెడ్డి, శ్రావణ్ రెడ్డితో పాటు షాద్ నగర్ తాలూకా లోని అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin