సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేటీఆర్ బొమ్మకు చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దయా దక్షిణాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన రాజ్యమేలుతుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం గూర్చి మాట్లాడే నైతిక అర్హత కెసిఆర్ కేటీఆర్ కుటుంబాలకు లేదని అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలని నినాదాలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని ప్రభుత్వం.. రైతుబంధు పేరుతో వ్యవసాయ పనిముట్లను దూరం చేస్తూ.. రైతులను దగా చేస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి చెల్లుతుందని విమర్శించారు. కేటీఆర్ నీతిమాలిన వ్యక్తి అని పరుష పదజాలాలతో దూషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin