సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్ : అరకొర వేతనంతో 14 ఏళ్లుగా విద్యాశాఖలో ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం అమలు చేయాలని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాచౌక్ వద్ద గత ఆరు రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్న విద్యాశాఖలోని సమగ్రశిక్ష-జేఏసీ దీక్షను బుధవారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలు బాగుపడుతాయని అనుకుంటే ఇంతవరకు ఉద్యోగ భద్రత,హెల్త్ కార్డులు,కనీస వేతనం అమలుకాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది బోధన,బోధనేతర కాంట్రాక్టు ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలువలు మంజూరు చేయాలని,కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.5 లక్షల ప్రమాదబీమా,విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇటీవల వీరు హైదరాబాద్ లో చేసిన దీక్షకు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అల్లకొండ శరత్,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin