సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ ప్రజలకు తాగునీరు కింద కిన్నెరసాని జలాలు గత 30 రోజులుగా బురదనీరుగానే వస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.శనివారం బూడిదగడ్ద బస్తీలో పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్ అధ్యక్షతన జరిగిన పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కామేష్ మాట్లాడుతూ కిన్నెరసాని జలాల విషయమై బీఎస్పి పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే వనమా,మున్సిపల్ పాలకవర్గం,మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై అధికారులు ఎలాంటి చలనం లేకపోవడంతో కిన్నెరసాన్ని నీటిని ముఖ్యమంత్రి కెసిఆర్ కి పోస్టల్ పార్సిల్ ద్వారా పంపించడం జరిగిందని గుర్తు చేశారు.బురద నీరు వస్తుందని ఒకవైపు ప్రజలు గగ్గోలు పెడుతుంటే కొందరు ఎమ్మెల్యే అనుచరులు అధికారులతో పరిశుభ్రమైన నీరు వస్తుందని చెప్పిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పట్టణ ప్రజలకు గత అనేక ఏళ్లుగా సింగరేణి సంస్థ వీధి కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా,శుభ్రంగా ఉంటుందని గుర్తు చేశారు.కిన్నెరసాని నీటి విషయమై పట్టణంలోని ఏ వార్డులోనైనా బహిరంగ చర్చ జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,అందుకు ఎమ్మెల్యే వనమా సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.కొత్తగూడెం,పాల్వంచ పట్టణాల అభివృద్ధికి వందల కోట్ల నిధులతో పనులు ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారని ఇది పూర్తి అవాస్తవమని అన్నారు.అదేవిధంగా పాత కొత్తగూడెంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఎందుకు దృష్టి సారించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని,అంగరంగ వైభవంగా ప్రగతి మైదానంను తీసుకువచ్చామని చెప్పి నెలలు గడుస్తున్న అభివృద్ధి పనుల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.అదేవిధంగా బైపాస్ రోడ్డు నిర్మాణమని ప్రగల్బాలు పలికారని దానిని సైతం అటకెక్కించారని అన్నారు.సుజాతనగర్ మండలం మొదలుకొని లక్ష్మీదేవిపల్లి మండలం వరకు ఎక్కడ వాహనాల పార్కింగ్ కు సంబంధించి స్థలం లేదని,కనీసం ఆ సౌకర్యం కల్పించడంలో కూడా ఎమ్మెల్యే వనమా విఫలమయ్యారని దుయ్యబట్టారు.శిలాఫలకాలు లేని శంకుస్థాపనలు చేస్తూ ఏ ఏ అభివృద్ధి పనులకు ఎన్ని నిధులు మంజూరు అయ్యాయో చెప్పే దమ్ము, ధైర్యం ఎమ్మెల్యేకు లేదని అన్నారు.తాను గతంలో సైతం పలుమార్లు బహిరంగ చర్చకు సవాల్ విసిరినట్లు తెలిపారు.కొత్తగూడెం నియోజకవర్గంలోని ఏ గ్రామంలో మంచినీటి సమస్య లేదో నియోజకవర్గ ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు.ఈ విషయంలో మీడియా సమక్షంలో బీఎస్పి పార్టీ తరఫున తాను బహిరంగ విచారణ చేద్దామని సూచించారు.ప్రతి గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్యలు ఉన్నాయని అన్నారు.ఇది పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యమని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin