సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, నవంబర్ 24, సర్కార్ టీవీ. షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు రేవంత్ రెడ్డి విజయభేరి ప్రచార ప్రభంజనం సృష్టించబోతున్నారని కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తండోపతండాలుగా తరలిరావాలని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు, ఎం.డి ఖాదర్ గోరి, కొన దేవయ్య తదితరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు పట్టణంలోని పాత జాతీయ రహదారి యాగశాల సభా ప్రాంగణం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ విభాగాల బాధ్యులు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని సూచించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మొదలైందని పేర్కొన్నారు. దాదాపు 60 నుండి 70 వేల మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రతాప్ రెడ్డి సూచన ప్రాయంగా తెలిపారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదే మర్యాద. పార్టీలో కొందరిని గౌరవించడం లేదని రాజీనామా చేసిన క్రాంతిరెడ్డి విషయంలో వచ్చిన విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నలకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చురకలు అంటించారు. మర్యాద లేదని పార్టీ నుండి వెళ్లిపోవడం కొందరికి రివాజుగా మారిందని మర్యాద పరస్పరం ఇద్దరు వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకునేదే అని మరి వారు కోరుకునే మర్యాద ఏ రకమైనదో? తనకు అర్థం కాలేదని ప్రతాప్ రెడ్డి నిగూఢంగా మాట్లాడారు. రాత్రికి కలిసి పని చేసిన యువ నాయకులు "తెల్లారేసరికి ఏం పంట పండిందో" వెళ్లిపోయారంటూ పార్టీకి రాజీనామా చేసిన వారిని ఉద్దేశించి చెప్పగానే మీడియాలో నవ్వులు పూశాయి. పార్టీకి కట్టుబడి పని చేయాలన్న సకల్పంతో పనిచేసే కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ఉంటారని పార్టీలు మారడం వెనుక చెప్పే అర్థాలు వేరుగా ఉంటాయని మాట్లాడారు. కలిసికట్టుగా కాంగ్రెస్ పని చేస్తుందని పార్టీలో అందరూ సమానమేనని ఎవరు ఎక్కువ తక్కువ కాదని ఈ సందర్భంగా వివరించారు. పార్టీలో చేరికలు సర్వసాధారణమేనని కొట్టిపారేశారు. అది ఏడుపో ... ఆనంద భాష్పాలో. ఎన్ఎస్ యుఐ నాయకుడు దినేష్ సాగర్ పార్టీకి రాజీనామా చేసిన విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్టీని వీడి బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిన వారి కళ్ళల్లో అవి కన్నీళ్లా ? లేక ఆనంద భాష్పాలా ? ప్రజలకు తెలుసని మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ చురకను అంటించారు. యువ నాయకుల రాజీనామా వ్యవహారంపై ఆయన ఘాటుగా స్పందించారు. గత రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో యువ నాయకులతో సహా మరో నాయకుడు ఇటీవల రాజీనామా చేసిన కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు పార్టీకి పనిచేయలేదని ఈ సందర్భంగా అన్నారు. అందరూ కలిసికట్టుగానే ఒకరు వెనకా ముందు పార్టీ విడిచి ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. తనకు టికెట్ కావాల్సిన సందర్భాల్లో మాత్రమే బీసీ నినాదం శ్రీనివాస్ గౌడ్ ఎత్తుకుంటాడని ఆ తర్వాత బీసీలకు టికెట్ కేటాయిస్తే పార్టీలు మారుస్తాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఢిల్లీలో టికెట్ కోసం లొల్లి పెట్టిన నాయకులు వారి అనుచరులు పార్టీ వీడుతున్నారు తప్ప అంతకుమించి ఇందులో ఎలాంటి విషయం లేదని కొట్టిపారేశారు. దినేష్ సాగర్ కు ఫోన్ చేసినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయని అతడు స్పందించలేదని పేర్కొన్నారు. అయినా ఆయన రాజీనామాలు మేము ఆమోదించలేదు కలిసి పని చేద్దాం రండి అని మీడియా ముందు పిలుస్తున్నాం అంటూ బాబర్ స్పందించారు. పార్టీ వీడడం వెనుక ఎవరి నిజరూపం ఏమిటో అందరికీ తెలిశాయని వివరించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టినోళ్ళ సంగతి చూస్తాం. సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మరో మహిళ నాయకురాలు, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి లపై సంభాషణ చేసుకున్న విధంగా వ్యంగ్యంగా తప్పుడు సమాచారాన్ని దుర్బుద్ధితో పోస్ట్ చేస్తున్నారని ఇలాంటి వ్యక్తులకు సరైన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఇలాంటి చిల్లర చేష్టలు చేసినోళ్ల పై ఎలా స్పందించాలో మాకు తెలుసని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ అదేవిధంగా పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేస్తున్నట్టు చెప్పారు. ఓడిపోతామని భయంతో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న చిల్లర వేషాలని ఈ సందర్భంగా రఘు వివరించారు.
-----------------------
Admin