సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందిస్తున్న విషయం విదితమే. మరోవైపు కడుపు నిండా సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నారు. అదేస్థాయిలో వచ్చే విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలల పిల్లలకు వర్క్‌బుక్స్, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్ ఉచితంగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో పాఠ్యపుస్తకాలతోపాటు విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.స్వరాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యమిస్తున్న సర్కారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌తోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. అలాగే మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సర్కారు బడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా నోట్, వర్క్‌బుక్స్ అందించాలని తాజాగా నిర్ణయించారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.27లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.మన ఊరు – మన బడి కార్యక్రమంతో కతాల్‌గూడ పాఠశాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. సకల వసతులు కల్పించి ఆంగ్ల విద్య బోధిస్తున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరువగానే పుస్తకాలు, యూనిఫాంతోపాటు వర్క్, నోట్‌బుక్స్ అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. నోట్ పుస్తకాల పంపిణీతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనున్నది. ఎస్‌ఎంసీ వైస్ చైర్మన్‌గా తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసి చైతన్యం చేయడంతోపాటు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేస్తా.
-----------------------
Admin