సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజలు అధికారం చేతికి ఇచ్చారని ప్రతిపక్షాలను చులకనగా, వెటకారంగా మాట్లాడితే తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని అధికార పార్టీ నాయకులారా తస్మాత్ జాగ్రత్త అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ సాధన కోసం మహాధర్నా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, స్థానిక కాంగ్రెస్ బీఎస్పి నేత దొడ్డి శ్రీనివాస్, సిపిఎం నేత ఎన్ రాజు, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు పెంటనుల నరసింహ మాదిగ శీను నాయక్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గానికి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ నిర్మాణంపై ఎలాంటి ప్రేమ, చిత్తశుద్ధి లేదని అన్నారు. కేవలం ప్రతిపక్షాలకు ప్రజా సంఘాలకు మాత్రమే రిజర్వాయర్ నిర్మాణ విషయంలో చిత్తశుద్ధి ఉందని అందుకే పోరాడుతున్నామని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పోరాటంలో ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే స్థానిక అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని అన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని వెటకారంతో మాట్లాడుతున్నారని కానీ తస్మాత్ జాగ్రత్త అంటూ వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా వేయలేదు, ప్రాజెక్టు నోటిఫికేషన్ రాలేదు, భూ సర్వే జరగలేదు అసలు ఏ పని మొదలు పెట్టలేదని, బస్సులు పెట్టి ప్రతిపక్షాలకు ప్రాజెక్ట్ చూపిస్తామంటే ఎలా అని శంకర్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఏకమై విమర్శిస్తుంటే అధికార పార్టీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియక అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తమకు ఉందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ప్రజాప్రతినిధులను కచ్చితంగా నిలదీస్తామని వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. వేలాదిమందితో ఇటీవలే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ స్థలం వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్ర చేసినట్టు చెప్పారు. ఎంతోకాలంగా రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆందోళనలు చేపడుతుంటే ప్రభుత్వానికి కంటగింపుగా ఉందని అన్నారు. పాలమూరు అధ్యయన వేదిక ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఒకటైతే పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రిజర్వాయర్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో అవే నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తామేదో ఊరికే అడగడం లేదని ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతున్నట్టు శంకర్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మించే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆగదని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వంపై ముప్పేట దాడిని చేస్తామని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకపోతే భవిష్యత్తులో అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పురుషోత్తం రెడ్డి, సుదర్శన్, బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, జంగా నరసింహా యాదవ్, కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, చల్ల శ్రీకాంత్ రెడ్డి, రాజు, అందే మోహన్, ముబారక్, హరినాథ్ రెడ్డి, కొమ్ము కృష్ణ, కుమారస్వామి, బాదేపల్లి సిద్ధార్థ, ఖదీర్, బ్యాటరీ కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు నాగమణి, వజ్రమ్మ, పిట్ట రజిత, ప్రదీప్ కుమార్, సీతారాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin