సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా భారీగా వదిలిన వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా,మక్తల్ మండలంలోని పసువుల వద్ద మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి కృష్ణానది వరద దృశ్యం పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.... ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచిస్తున్నట్లు తెలిపారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం సుమారు 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారనీ, ఎగువ నుంచి వస్తున్న వరద పరిస్థితిపై కర్ణాటకలోని బీజాపూర్ కలెక్టర్ తో నారాయణపేట కలెక్టర్ నిరంతరం మాట్లాడుతూ సమాచారం సేకరించాలన్నారు. వరద ఉధృతి తగ్గేవరకు కర్ణాటక దత్త పీఠానికి బోట్ ప్రయాణం ఆపాలని అధికారులకు ఆదేశించారు. గతంలో పడవ మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఇప్పటికీ ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్నదనీ భవిష్యత్తులో పడవ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్థానిక బోట్ నిర్వాహకులకు నాగార్జునసాగర్ లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. కృష్ణానది వరద ఉధృతిపై అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలనీ కృష్ణ నది పరివాహక గ్రామాల వద్ద ప్రజలు ఎవరు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. పసుపుల నుంచి దత్తపీఠం వెళ్లే భక్తులు తప్పనిసరిగా వరద ఉధృతి తగ్గేవరకు నదిలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. నారాయణపేట జిల్లా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది తీర ప్రాంతం వద్ద ప్రజలు నదిలోకి వెళ్లకుండా నిరంతరం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారనీ తెలిపారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కురువపురం దత్తపీఠం దీవికి చేరుకునేందుకు త్వరలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పెద్ద బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పసుపుల నుంచి దత్తపీఠం వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి భక్తులు సులభంగా దత్త పీఠం దేవాలయం చేరుకునేందుకు కృషి చేస్తామని, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా పసుపుల వద్ద 5 ఎకరాల్లో హరిత హోటల్ కన్వెన్షన్ సెంటర్, బోటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పి సత్యనారాయణ, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో శ్రీధర్, స్థానిక సర్పంచ్ దత్తు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కర్ని నూతన మండలం కోసం వినతి పత్రాన్ని అందజేసిన యువకులు.... పసుపుల వద్ద కృష్ణా నది వరద ఉధృతిని పరిశీలించిన తర్వాత తిరుగు ముఖంలో కర్ని వద్ద నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. కర్ని గ్రామ యువకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి యువకులకు మండల ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
-----------------------
Admin